భయం అనేది మనిషిని సగం చంపేస్తుంది.. పూర్తిగా చనిపోవడానికి కూడా ప్రేరేపిస్తుంది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోండగా.. ఓవైపు ప్రభుత్వాలు, డాక్టర్లు కరోనాను అదుపు చెయ్యడానికి నడుం బిగిస్తే.. మరోవైపు సోషల్ మీడియా ఫేకు వార్తలు.. కరోనాపై కొందరు ప్రచారం చేస్తున్న వార్తలు కారణంగా భయంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపితులు అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలో కరోనా సోకిందని భయపడిపోయి బెంగళూరులో రోడ్డు రవాణా సంస్థకు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. కరోనా సోకిందనే అనుమానంతో ఇద్దరు వృద్ద దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది.
కరోనా వస్తే ప్రమాదమే.. కానీ దానికి వైద్యం ద్వారా కూడా పరిష్కారం దొరుకుతుంది కదా? అది రాకముందే ప్రజలు భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాలకు మరో తలనొప్పిగా తయారైంది. లేటెస్ట్ గా తనకు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరివిరాలకి చెందిన శ్రీనివాస్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండగా.. దగ్గు, జ్వరం రావడంతో ఆస్పత్రిలో చూపించుకోకుండా.. తనకు కరోనా వ్యాపించిందేమో అని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే మాచెర్లలో కూడా ఓ వ్యక్తి ఇలాగే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. సోషల్ మీడియా హడావుడి పెరిగిపోయిన తర్వాత.. ఫేక్ వార్తలు వ్యాప్తిలోకి ఎక్కువగా వస్తున్నాయి. సంబంధం లేని ఫోటోలు, పాత వీడియోలు, క్రియేటెడ్ ఆడియోలు ఒకటేంటి మనిషిని ఎన్నిరకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెడుతున్నాయి.
కరోనా వస్తే శవం కూడా ఇవ్వరూ అంటూ ఫేక్ వార్తలు.. నిజంగా జనాల్లో భయాందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. ఇటువంటి వార్తలు కారణంగానే ఆరోగ్యవంతులు కూడా ప్రేరేపించబడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దయచేసి అలా చెయ్యొద్దు అంటూ డాక్టర్లు కూడా చెబుతున్నారు. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంది.. ప్రతి జబ్బుకు ఓ మందు ఉంటుంది. కాకపోతే రావడానికి మాత్రం కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా అనుమానాలు ఉండే ప్రభుత్వం సూచించిన హెల్ప్ లైన్ నంబర్లనో.. లేకుంటే డాక్టర్లనో కలవడం ఉత్తమం.
Also Read | కిరాణా సరుకులకు శానిటైజేషన్ అవసర్లేదు