తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం అయ్యాయి. వీటితోపాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడిగా తేల్చి ఆభరణాల విలువకు సరిపడా డబ్బును అతని దగ్గర నుంచి నెల నెల రూ.30వేల లెక్కన రికవరీ చేస్తున్నారు అధికారులు.
అయితే తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా రికవరీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆయన ఒక్కరినే ఎందుకు బాధ్యులను చేశారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆభరణాలు ఎవరు తీశారో తేల్చకుండా కేవలం ఒక అధికారిని మాత్రమే బాధ్యుడిని చేసి రికవరీ చేస్తే సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దీని వెనక ఏదైనా కుట్ర ఉండి ఉండవచ్చుననే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారుల తీరు తరుచు వివాదాలకు దారి తీస్తోండగా లేటెస్ట్ గా కిరీటం వ్యవహారం కూడా వివాదాలకు కారణం అవుతుంది. ఇప్పటికే అనేకసార్లు ఆభరణాలు మాయం అవుతున్నాయని ఆరోపణలు వచ్చినా కూడా అధికారుల తీరులో మాత్రం మార్పు రాట్లేదు. ఈ విషయంలో భక్తులు కూడా టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.