శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

  • Publish Date - September 30, 2019 / 01:44 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  ఉత్సవాల్లో  భాగంగా రెండో రోజు సెప్టెంబరు30, సోమవారం నాడు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది.  త్రిపురుని భార్య త్రిపురసుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్ధం. స్వర్గ, భూ, పాతాళం అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు.

శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే.మనస్సు బుధ్ధి చిత్తం  ఆహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో  అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగి పోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమే అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరిదేవీ అనుగ్రహం కోసం  బాలార్చన చేస్తారు.  

విద్యలో మొదటి విద్య బాల అందుకే ఆధ్యాత్మిక విద్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని ఉపాసన చేస్తారు. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈరోజు  రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. “ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపురసుందర్యైనమో నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి.  అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.