గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు : నేడు గరుడ సేవ

  • Publish Date - May 15, 2019 / 04:06 AM IST

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మే 15వ తేదీ బుధవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గురుడ సేవ జరుగనుంది. శ్రీ గోవింద రాజ స్వామి వారు తనకిష్టమైన గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ పెద్దమాడ వీధుల్లో విహరించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 

నాలుగో రోజు మే 14వ తేదీ మంగళవారం ఉదయం 7 నుంచి 8.30గంటల వరకు వాహనసేవ జరిగింది. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుక జరిగింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవను నిర్వహించారు. రాత్రి 8 నుండి 9.30గంటల వరకు సర్వభూపాల వాహన సేవ వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీటీడీ పెద్ద జీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సహాయ కార్యనిర్వహణాధికారి ఉదయ భాస్కర్ రెడ్డి, సూపరిటెండెంట్లు జ్ఞానప్రకాష్, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.