ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రోజుకో స్టేట్ మెంట్ వస్తుండడంతో.. అయోమయంలో పడిపోతున్నారు ప్రజలు. అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే.. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మళ్లీ రాజధాని అమరావతి విషయంలో ప్రజలకు అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి మారుస్తున్నారంటూ వార్తలు వచ్చిన క్రమంలో పలు పార్టీల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ గా అమరావతి రాజధాని విషయంలో మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు.. ఏపీకి రాజధాని కట్టే విషయంలో వైసీపీ ప్రభుత్వం సుముఖంగా లేనట్టు కనిపిస్తోందని, అమరావతిని రాజధానిగా కొనసాగించడం ప్రభుత్వానికి ఇష్టం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న ప్రకటనలు బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోందని అన్నారు.
అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మేము గతంలోనే చెప్పామని, ఆ విషయం వాస్తవమేనని జీవీఎల్ అన్నారు. అయితే రాజధాని విషయంలో రాష్ట్రంలో నెలకొన్న డైలమాను తొలగించాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ఉందని అన్నారు. దీనిపై సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి రాజధాని అనేది పూర్తిగా.. రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంకు సూచించారు.