అసెంబ్లీలో జగన్ మాటలను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే మూడు రాజధానులు అని అనడం సముచితం కాదన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని, జగన్ చేసిన ప్రకటనలో ఇంకా స్పష్టత ఇవ్వాలని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు బేఖాతరు చేశారని విమర్శించారు. ఎక్స్‌పర్ట్ కమిటీనే కేంద్రం నియమించింది అని ఆ కమిటీ సూచనలు పట్టించుకోకుండా చంద్రబాబు మంత్రి నారాయణ కమిటీ నియమించి ఆయన కమిటీ ప్రకారం రాజధానిని నియమించారని అన్నారు. ఇప్పుడు ఆ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఆలోచనలు ఉన్నట్లు తమకు అర్థమవుతుందని అన్నారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. హైకోర్టు ఏ రాష్ట్రంలో రాజధానిలో లేదని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. సీఎం జగన్ ప్రకటనతో రాజధానిపై క్లారిటీ వచ్చిందని అన్నారు.
అయితే అమరావతిలో ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి అమరావతిని కేవలం లెజిస్లేచర్ కాపిటల్ కు మాత్రమే పరిచయం చేయకుండా అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకే పరిమితం చేయవద్దన్నారు. రాజధానిపై రాజకీయ, సామాజిక కోణంలో చూడడం కరెక్ట్ కాదని అన్నారు.
ఎక్కడ రాజధాని ఉన్నా రోడ్డు, రైలు కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వికేంద్రీకరణను తాను సమర్థిస్తున్నానని జీవీఎల్ తెలిపారు. సీమలో హైకోర్టు ఏర్పాటు డిమాండ్ బీజేపీ చేస్తుందేనని అన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని జీవీఎల్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు.