గోదావరి బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్… మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. గోదావరిలోకి బోటు వెళ్లకుండా దేవీపట్నం ఎస్సై అనుమతి నిరాకరించినా… మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడితో ఎస్పీ బోటుకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసిందన్నారు హర్షకుమార్. బోటులో ఉన్నది 73మంది కాదని… 93 మంది ఉన్నట్లు తనకు సమాచారం ఉందని బాంబు పేల్చారు. హర్షకుమార్ ఆరోపణలపై మంత్రి అవంతి ఘాటుగా స్పందించారు. బాధితులను ఓదార్చే టైంలో.. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆధారాలు చూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
మరోవైపు…బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం పడవ మునిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం ఐదో రోజు.. మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు దొరికిన మృతదేహాల సంఖ్య 36కి చేరింది. మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిగిలిన మృతదేహాలు.. బోటు కిందే ఉన్నాయా.. లేక కిందకి కొట్టుకుపోయాయా అన్న దానిపై స్పష్టత లేదు. బోటు బయటకు తీస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు. అయితే గోదావరిలో ఆఖరి మృతదేహం దొరికే వరకూ ఆపరేషన్ కొనసాగిస్తామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఎంత ఖర్చైనా.. ఎంత రిస్కైనా.. మృతదేహాలు వెలికితీసేందుకు శ్రమిస్తామన్నారు.
Read More : మునిగిన బోటులో ఉన్నది 73మంది కాదు.. 93మంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు