ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బకు ఏపీలో 23మంది చనిపోయారంటే ఎండల తీవత్ర ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో వడదెబ్బకి 11మంది చనిపోయారు. కడప జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు చనిపోయారు.
సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల 46 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 46.73, ప్రకాశం జిల్లా కనిగిరిలో 46.65, చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో 46.44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రానున్న 4 రోజులు ఎండల తీవ్రత ఉంటుందని, కోస్తాంధ్రలో వడగాలులు తీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలుల ప్రమాదం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది. బుధవారం (మే 8,219) ఏపీలో చాలా చోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. మే 8,9,10, 11వ తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండలు కొనసాగినా ప్రస్తుతానికి వడగాలులు ప్రబావం అంతగా ఉండదని అంచనా వేసింది.
ముందు ముందు ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఎండల తీవ్రతకు రోడ్ల పక్కన ఉండే చిరు వ్యాపారులు, కూలి పనులు చేసేవారు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులు రాత్రి 9 గంటల వరకు ఏ మాత్రం తగ్గడం లేదు. రోడ్డు మీదకు వస్తే నిప్పల గుండం పక్క నుంచి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు పిల్లలు, వృద్దులు బయటకి రాకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. అప్పుడు ఇంకెలా ఉంటాయోనని ప్రజలు వణికిపోతున్నారు.
* జంగమహేశ్వరపురం 45 డిగ్రీలు
* కర్నూలు 44 డిగ్రీలు
* కావలి 44 డిగ్రీలు
* నెల్లూరు 44 డిగ్రీలు
* తిరుపతి 43 డిగ్రీలు
* నందిగామ 42 డిగ్రీలు
* విజయవాడ 41 విగ్రీలు
* అనంతపురం 41 డిగ్రీలు