ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్

  • Publish Date - March 22, 2019 / 07:02 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి హీరో శివాజీ ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలను, పార్టీల అభ్యర్ధులను బయపెట్టేందుకే ఢీల్లీ నుంచి కొంతమంది ఆదేశాలతో ఈ దాడులు జరగుతున్నాయని ఆరోపించారు.

కొత్తగా తెచ్చిన నిబంధన ప్రకారం.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రూ.100 కోట్లు ఉన్నాయని, ఒకవేళ నేను చెబితే… 100 నిమిషాల్లో అక్కడుకు వెళ్లి ఫాంహౌస్‌లో సోదాలు చేయాలట. చంద్రబాబు ఇంట్లో రూ. 1000 కోట్లు ఉన్నాయంటే చెక్ చేయాలట. జగన్ ఇంట్లో రూ. 2000 కోట్లు ఉన్నాయంటే సోదా చేయాలట. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి రెయిడ్స్ లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారు’ అని శివాజీ చెప్పారు.
Read Also : వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ – వైసీపీ రాళ్ల దాడులు

ఢిల్లీ నుంచి పెద్దలు ఇటువంటి పనులు చేయించడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే మీకు అవసరం లేని నాయకుడిని చంపేయండి. మీకు కావలిసింది ఎన్నికలు సరిగ్గా జరగకూడదు. మీకు అనుకూల ప్రభుత్వం రావాలి.  బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో నగదు తీసుకెళ్తుంటే కూడా సామాన్యుల డబ్బును సీజ్‌ చేస్తున్నారని సీఈవో దృష్టికి శివాజీ తీసుకెళ్లారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయంటూ ద్వివేదీ తనకు చెప్పినట్లు శివాజీ వెల్లడించారు. ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఇటువంటి దాడులు జరగలేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి ఉందంటూ ఆరోపించారు.
Read Also : ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల – బాలినేని వర్గాల ఘర్షణ