అసంతృప్తి జ్వాలలు : పాడేరు YCP ఆఫీసు వద్ద టెన్షన్

  • Publish Date - March 23, 2019 / 11:44 AM IST

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ నామినేషన్ల దాఖలు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీల్లో అసమ్మతి చల్లారడం లేదు. టికెట్ దక్కని వారు రెబెల్స్‌గా బరిలో దిగడం…అక్కడక్కడ ఆందోళనలు చేస్తుండడంతో ఆయా పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సభ నిర్వహిస్తున్న సందర్భంలో ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు ఆందోళన చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. 

విశాఖపట్టణం జిల్లాలోని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కె.భాగ్యలక్ష్మీకి రావడం విశ్వేశ్వరాజు వర్గీయులకు తీవ్ర ఆగ్రహం కల్పించింది. ఇక్కడి నుండి ఆయన టికెట్ ఆశించారు. మార్చి 23వ తేదీ శనివారం పాడేరులో జగన్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. దీనితో పాడేరు వైసీపీ కార్యాలయానికి చేరుకున్న విశ్వేశ్వరరాజు వర్గీయులు పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను బయటపడేశారు. రోడ్డుపైకి తీసుకొచ్చి నిప్పు పెట్టారు. దీనితో ఆ మార్గంలో ట్రాఫిక్ జాం అయ్యింది. ‘కె.భాగ్యలక్ష్మీ వద్దు..విశ్వేశ్వరరాజు ముద్దు’ అనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవిష్యత్‌లో న్యాయం చేస్తానని విశ్వేశ్వరరాజకు జగన్ హామీనిచ్చారని తెలుస్తోంది. బుజ్జగింపులకు విశ్వేశ్వరరాజు దిగొస్తారా ? లేక రెబెల్‌గా బరిలోకి దిగుతారా ? అనేది చూడాలి. 

ట్రెండింగ్ వార్తలు