గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ క్రమంలోనే మృతుల వివరాలు తెలిసిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… మృతుల కుటుంబాల్లో ఎవరికీ ఉద్యోగం లేకుంటే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. బీమా మొత్తం త్వరలోనే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మృతుల్లో అనకాపల్లి మండలానికి చెందిన వారు ముగ్గురు, మహారాణిపేట, పెందుర్తి మండలాలకు చెందిన వారు ఇద్దరేసి, విశాఖ గ్రామీణం, గోపాలపట్నం మండలాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వారికి పరిహారం అందించారు అవంతి శ్రీనివాస్.
ఇదిలా ఉంటే మరోవైపు రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడం రోజురోజుకీ కష్టంగా మారొపోతుంది. మూడు రోజులు పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవగా.. నాలుగవ రోజు బోటు బయటకు తీసే ఆపరేషన్ ఆగిపోయింది.
కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నా తాత్కాలికంగా నిలిపివేశారు. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడిచినా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాలేదు.