హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

  • Publish Date - September 23, 2019 / 07:13 AM IST

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. నామినేషన్‌ దాఖలు చేసేందుకు 1+4 సభ్యులను మాత్రమే అనుమతించనున్నట్టు స్పష్టం చేసింది.

ఇక దాఖలు చేసిన నామినేషన్లను అక్టోబర్‌ 1న పరిశీలిస్తారు. అక్టోబర్‌ 21న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరుగనుంది. సెప్టెంబర్ 21 కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

2018లో ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్..నల్గొండ ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. తర్వాత హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ శనివారం మాట్లాడి, తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 

సిట్టింగ్ స్థానం కాబట్టి..తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ ఎవరు బరిలోకి దిగుతారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే నేతల్లో అభిప్రాయబేధాలు నెలకొన్నాయి. హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ సతీమణిని నిలుపుతారనే ప్రచారంపై కాంగ్రెస్‌లో ఓ వర్గం ఆగ్రహంగా ఉంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాంటూ ఉత్తమ్‌పై మండిపడుతున్నారు. కాంగ్రెస్‌లోని విబేధాలు తమకు లాభిస్తాయని టీఆర్ఎస్ యోచిస్తోంది.