హుజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబర్ 21న జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. అక్టోబర్ 24న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు. మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికల వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయని ప్రకటించింది. శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
> సెప్టెంబర్ 23న నోటిఫికేషన్..
> నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 4.
> పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 21న.
> అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు.
2018లో ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్..నల్గొండ ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. తర్వాత హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
సిట్టింగ్ స్థానం కాబట్టి..తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ ఎవరు బరిలోకి దిగుతారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే నేతల్లో అభిప్రాయబేధాలు నెలకొన్నాయి. హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ సతీమణిని నిలుపుతారనే ప్రచారంపై కాంగ్రెస్‌లో ఓ వర్గం ఆగ్రహంగా ఉంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాంటూ ఉత్తమ్‌పై మండిపడుతున్నారు. కాంగ్రెస్‌లోని విబేధాలు తమకు లాభిస్తాయని టీఆర్ఎస్ యోచిస్తోంది. ప్రధాన పార్టీలు ఏ అభ్యర్థిని ప్రకటిస్తారనేది కొద్ది రోజుల్లో తేలనుంది.
Read More : అక్టోబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ : ఒకే దశలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు