విశాఖకు మోడీ : వరాలు కురిపిస్తారా 

  • Publish Date - March 1, 2019 / 01:26 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు  రైల్వే గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు చేరుకుంటారు. రాత్రి 7గంటల 50నిమిషాల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత 8గంటల 10నిమిషాలకు ఎయిర్‌పోర్టుకు చేరుని ఢిల్లీ బయల్దేరి వెళతారు.

ప్రధాని రాక నేపథ్యంలో.. బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మోడీ పాల్గొనే సభకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నాయి. రైల్వే గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహిస్తున్న సభకు బీజేపీ నేతలు సత్యమేవ జయతే అని నామకరణం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదిక, చుట్టు పక్కల ప్రదేశాలు, నివాసాలు, ఖాళీ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు పర్యవేక్షించారు. దాదాపు 2వేల మంది పోలీసులతో ప్రధాని పర్యటనకు బందోబస్తు కల్పిస్తున్నట్లు విశాఖ సీపీ లడ్డా తెలిపారు. 

గుంటూరు జిల్లా పర్యటనలో ఎలాంటి హామీలు ఇవ్వని మోడీ… ఈసారి వరాలు కురిపిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ పర్యటనకు ముందు రైల్వే జోన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రైల్వే జోన్ విషయంలో విపక్షాల వాదనను కాషాయ నేతలు తోసిపుచ్చారు.