ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రజావేదిక పరికరాలు వేలం

  • Publish Date - February 25, 2020 / 04:09 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో కూల్చివేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) సిద్ధం అయ్యింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చేసిన సంగతి తెలిసిందే.

 

అప్పట్లో వారం రోజులు పాటు కూల్చివేతలు జరగగా.. కూల్చివేతల తర్వాత ఉన్న విలువైన సామాగ్రిని అధికారులు అక్కడే ఉంచారు. కేవలం చిన్న చిన్న పూలమొక్కలను మాత్రమే అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. విలువైన సామాగ్రిని అక్కడి వదిలి వేయగా.. ఆ పరికరాలను రక్షించడం ఇబ్బందిగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ పరికరాలు పాడైపోయే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేశారు.

 

దీంతో విలువైన సామానును వేలం వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజావేదిక పరికరాలను వేలం వేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ ప్రజావేదిక పరికారల వేలం పత్రాల వివరాలను.. మార్చి 3లోగా వెబ్‌సైట్‌ నుంచి పొందాలని.. మార్చి 4న మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.