మార్చి 14.. జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం.. ప్రశ్నిస్తా అంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి ఆరు వసంతాలు పూర్తయ్యింది. ఏడవ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన తీరు సరికాదంటూ.. రాజకీయాలను ప్రశ్నిస్తూ.. 2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – టీడీపీతో కలిసి నడిచారు. అయితే ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది.
2014 -19 మధ్య కాలంలో రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ సమీకరణాలు మారాయి. టీడీపీ పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్.. 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఓటమికి కుంగిపోక మళ్లీ జనసేనను పటిష్టం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. ఎన్నికల అనంతరం పవన్ బీజేపీకి దగ్గరయ్యారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఓవైపు మ్రోగగా.. జనసేన ఆవిర్భావ దినోత్సం వేడుకలను రాజమహేంద్రవరంలో నేడు(14 మార్చి 2020) ఘనంగా నిర్వహించేందుకు పార్టీశ్రేణులు సిద్ధం అయ్యాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. అక్కడే జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి.. భారీ కేక్‌ను పవన్ కట్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని రామపాదాల రేవులో పవన్.. గోదావరి నదికి హారతి ఇచ్చి మన నుడి – మన నది కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు.
Also Read | విశాఖ చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు…విమాన సర్వీసులు రద్దు