చంద్రబాబును అరెస్ట్ చేస్తారా? : ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

  • Publish Date - January 9, 2020 / 04:04 AM IST

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చెయ్యడం.. పాదయాత్ర చేసేందుకు అనుమతి లేదని చెబుతూ చంద్రబాబును వాహనంలో తీసుకెళ్లారు పోలీసులు.

చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అరెస్ట్‌లతో ఉద్యమం ఆగదంటూ మండిపడ్డారు.

అమరావతి మహిళలు, వృద్ధులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కూడా పవన్ తప్పుబట్టారు. ఇటువంటి తీరు సమంజసం కాదని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే తక్షణమే రాజధాని గందరగోళానికి ప్రభుత్వం తెరదించాలని ఆయన సూచించారు.

అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అది మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలని పవన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని జగన్ సర్కార్ యోచిస్తోందా..? అంటూ పవన్ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకొని రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వాలని అన్నారు.