ముహూర్తం కుదిరింది : పవన్ నామినేషన్ వేసేది అప్పుడే

  • Publish Date - March 19, 2019 / 03:51 PM IST

ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలుస్తున్న జనసేన పార్టీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల బరిలో నిలుస్తున్నారు.  అయితే పవర్ స్టార్ నామినేషన్ ఎప్పుడు వేస్తారని ప్రకటించలేదు. 

మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం జనసేన దీనిపై క్లారిటీ ఇచ్చింది. గాజువాక, భీమవరం శాసనసభ అసెంబ్లీ స్థానాలకు మార్చి 21వ తేదీ గురువారం, మార్చి 22వ తేదీ శుక్రవారం తేదీల్లో నామినేషన్ వేస్తారని వెల్లడించింది. 21వ తేదీన గాజువాకలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1గంట మధ్య నామినేషన్ వేస్తారని పేర్కొంది. సంబంధిత రిటర్నింగ్ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలను సమర్పిస్తారని తెలిపింది.

ఇక మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరం అసెంబ్లీ స్థానానికి పవన్ నామినేషన్ వేస్తారని, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5గంటల సమయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన ప్రకటించింది. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న సమయంలో చిరంజీవి 2 చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేశారు. అప్పుడు తిరుపతి నుండి మాత్రమే చిరంజీవి నెగ్గారు.