పవన్ కళ్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని నిర్ణయాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక సినిమాల్లో నటించబోనని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారని, దీని వల్ల ఆయనకు నిలకడ లేదని తెలుస్తోందని అతనితో కలిసి పనిచెయ్యడం కష్టమే అన్నట్లుగా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ నిర్ణయంపై జనసేన పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ప్రకటనను విడుదల చేసింది…
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము..
శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్ట్‌లు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చెయ్యడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.
ఇట్లు
పవన్ కళ్యాణ్,
జనసేన అధ్యక్షులు
అంటూ లేఖను జనసేన విడుదల చేసింది.
ఇక పార్టీకి గుడ్ బై చెప్పేసిన వీవీ లక్ష్మినారాయణ.. ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? లేదా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ మేరకు ఎలాంటి సంకేతాలు కూడా ఆయన ఇవ్వలేదు. రాజకీయాలపై ఆసక్తితో.. ముందుగానే ఐపీఎస్‌కు రిటైర్మెంట్ తీసుకున్న వీవీ లక్ష్మినారాయణ తదుపరి అడుగు ఏంటీ అనేది తెలియవలసి ఉంది.
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/armFdrrF5z
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2020