మూడు రాజధానుల నిర్ణయానికి జనసేన ఎమ్మెల్యే సపోర్ట్

  • Publish Date - January 4, 2020 / 04:05 AM IST

జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీకి, పవన్ కళ్యాణ్‌కి మరోసారి షాక్ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని అన్నారు రాపాక.

నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని అభిప్రాయపడ్డారు రాపాక. మంచి చేస్తే మద్దతు ఇస్తామని… చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు రాపాక.

జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఇప్పటికే మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ నిర్ణయంకి వ్యతిరేకంగా రాపాక వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు జగన్ నిర్ణయాలకు ఆయన సపోర్ట్ చేశారు. మరోసారి అదేరకంగా ఆయన సపోర్ట్ చేయడం విశేషం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తోందని ఇప్పటివరకూ చేసిన, చేపట్టిన ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేవి.. ఈ విషయంలో ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.