ఏపీలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి రాజధాని ప్రాంతంలో రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతు తెలిపి వారితో పాటు ధర్నాలు నిర్వహిస్తోంది. రాజధానిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించటానికి విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించబోతున్నారు.
జనసే పార్టీ డిసెంబర్ 30న విస్తృతస్ధాయి సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని పార్టీ ఆఫీసులో సమావేశం అవుతారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నెలకొన్న పరిస్ధితులు, రాజధాని అమరావతి గ్రామాల్లో ప్రజలు, రైతులు చేస్తున్న ఆందోళన, రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన పార్టీ స్టాండ్ , పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
జనసేన పోలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు,అధికార ప్రతినిధులు రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. ఒకవైపు 3రాజధానులు అంశాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించగా ఆయన సోదరుడు మెగా స్టార్ చిరంజీవి 3 రాజధానుల అంశానికి మద్దతిచ్చారు.