జగన్ మా అబ్బాయి : వైసీపీ పాలనకు 100 కి 150 మార్కులు

  • Publish Date - October 23, 2019 / 07:58 AM IST

ఏపీ సీఎం జగన్‌ పాలనకు టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కితాబిచ్చారు. ఆయన పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలని వెల్లడించారు. జగన్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ మా అబ్బాయే అన్నారు. 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలనలో జగన్ కిందా..మీద పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ ఉండగా..జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయని, తనకు ఉన్న ఎన్నో బస్సుల్లో ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని తెలిపారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమని చెప్పుకొచ్చారు. ఫైన్‌లతో పోయే తప్పిదాలను సీజ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 

జగన్ పాలనపై గతంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జగన్ పాలనపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే..ఈయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జేసీ 100 మార్కులు పడుతాయన్నారు. కానీ..ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమీషనర్  ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచటం వంటి ఆరోపణలు వచ్చాయని, అవి నిజమేనని తేలటంతో సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.  
Read More : బోటు ప్రమాదం : రమ్య ఎక్కడమ్మా