మోడీపై టీడీపీ యుద్ధం : ధర్మపోరాట దీక్ష భారీ ఏర్పాట్లు

  • Publish Date - February 11, 2019 / 01:21 AM IST

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష స్టార్ట్ కానుంది. దీక్షలో భాగంగా బాబు ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్‌లో.. అనంతరం ఏపీ భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత 8 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. 

ఏపీ నలూమూలల నుంచి తరలివచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నారు. ఏపీ భవన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పిస్తున్నారు. ఢిల్లీలోని సీఎం కాటేజ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక వీఐపీల కోసం హోటల్‌ రాయల్ ప్లాజాలో 30 గదులు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం హోటల్‌ సూర్యలో 100 గదులు .. పార్టీ సీనియర్ల కోసం YMCAలో 35 గదులు…కర్జన్ రోడ్‌ హోటల్‌లో 45 గదులు…హోటల్ సదరన్‌ లో 35 గదులు…ఓయో హోటల్స్‌లో 850 గదులు… టీటీడీ గెస్ట్‌హౌజ్‌లో 5  గదులతో పాటు ఏపీ, కేరళ, మహారాష్ట్ర భవన్‌లలో మరో 50 గదులు బుక్ చేశారు.

సెంట్రల్‌ ఢిల్లీలో చంద్రబాబు ఫోటోలతో భారీగా పోస్టర్లు 
అశోక రోడ్‌, మాన్‌సింగ్‌ రోడ్, రఫీ మార్గ్, జన్‌పథ్‌లలో భారీ ఫ్లెక్సీలు
మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ
ఏపీకి రావాల్సిన వాటిపై వినతి పత్రం   

మరోవైపు ధర్మపోరాట దీక్ష నేపథ్యంలో సెంట్రల్‌ ఢిల్లీలో చంద్రబాబు ఫోటోలతో భారీగా పోస్టర్లు వెలిశాయి. అశోక రోడ్‌, మాన్‌సింగ్‌ రోడ్, రఫీ మార్గ్, జన్‌పథ్‌లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ అంతా కూడా ధర్మపోరాట హోరు వినిపించేలా దీక్షకు ఏర్పాట్లు చేశారు. ఇక తన దీక్షకు మద్దతు తెలపాలని చంద్రబాబు పలువురు జాతీయ నేతలకు లేఖలు రాశారు. అలాగే ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై వినతపత్రం సమర్పిస్తారు. మొత్తానికి మోదీపై యుద్ధం చేస్తున్న టీడీపీ.. ఇప్పుడు ఢిల్లీలోనే ధర్మపోరాట దీక్ష చేయనుండడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. 

దీక్షలో మొత్తం 7వేల మంది పాల్గొననున్నారు. 
26 మంది టీడీపీ మంత్రులు
100 మంది ఎమ్మెల్యేలు
56 మంది ఎమ్మెల్సీలు 
300 మంది పార్టీ సీనియర్ నేతలు
3 వేల మంది ఈ దీక్షకు హాజరుకానున్నారు. 
ఢిల్లీ నుంచి 2 వేల మంది తెలుగు ప్రజలు…మరో 2 వేల మంది స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ప్రతినిధులు దీక్షకు హాజరు.