విదేశాల్లో ఉన్నవారిని ‘వందే భారత్ మిషన్’ కింద స్వదేశానికి చేర్చే దుబాయ్ -కోజికోడ్ విమానం కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోజికోడ్, మలప్పురం వాసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భయకరమైన వాతావరణంలో కూడా స్థానికులు పోలీసులకు సహాయంగా నిలబడ్డారు. తమవంతుగా వారికి సహకరించారు. వారు చేసిన సహాయానికి పోలీసులు ఎంతగానో సంతోషంచారు. వారికి తమ కృతజ్ఞలు తెలుపుకోవాలనుకున్నారు.
అలా తమకు సహాయం చేసిన స్థానికుల ముందు నిలబడి ఓ పోలీసు అధికారి సెల్యూట్ చేశారు. ఇదికాస్తా వివాదాస్పదమైంది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో వారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కోజికోడ్ లో సీనియర్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న ఎ.నిజార్ అనే పోలీస్ విమాన ప్రమాదం సమయంలో అక్కడే విధుల్లో పాల్గొన్నారు. ఇదే ప్రమాదంలో మరణించిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ సోకడంతో, వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్ చేశారు. వారు ఉన్న క్వారంటైన్ కేంద్రానికి వెళ్లిన నిజార్, వారి సేవలకు గుర్తుగా సెల్యూట్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన మలప్పురం పోలీస్ చీఫ్ అబ్దుల్ కరీమ్, పోలీసులు ఎవరికి సెల్యూట్ చేయాలన్న విషయమై ఏ విధమైన ప్రొటోకాల్స్ లేవని, నిజార్ చేసిన సెల్యూట్ చట్ట వ్యతిరేకమని చెప్పలేమని అన్నారు. అతనిపై ఎటువంటి చర్యలూ తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పోలీసు చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతుండగా, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా సామాన్యులకు పోలీసు అధికారి సెల్యూట్ చేయటం ఏమింటూ ఓ వర్గం విమర్శిస్తోంది.