విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుసగా మూడు రోజులు శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించింది. కిడ్నీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 66 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టు గుర్తించింది. ఆస్పత్రి రికార్డులు పోలీసుల దగ్గర ఉండడంతో మహారాణిపేట పీఎస్‌లోనూ తనిఖీలు చేసింది. మే 16వ తేదీ బుధవారం కలెక్టర్‌కు కిడ్నీరాకెట్ అక్రమాలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అందజేయనుంది.
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో మరోసారి శ్రద్ధ హస్టల్ సిబ్బందిని విచారణ చేయనుంది త్రిసభ్య కమిటీ. కిడ్నీ మార్పిడి కేసులపై ఆరా తీయనుంది. అయితే యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయింది. అవయవాలు మార్పిడి చేసే 9 ఆసుపత్రులకు 30 ప్రశ్నలతో కూడిన పత్రాలను పంపించింది. వాటికి సంబంధించిన సమాధానాలు సంతృప్తికరంగా లేవంటున్నారు కమిటీ సభ్యులు.
శ్రద్ద ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్‌లో ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు అనే దానిపై విచారించనుంది. కిడ్నీలు ఎవరు ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారు… కిడ్నీ గ్రహీతకు …. సంబంధిత బంధువలే ఇచ్చారా… లేక థర్డ్‌పార్టీ ఇచ్చారా అన్న అంశాలపై కూపీ లాగుతున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఎన్ని జరిగాయి, డబ్బులు తీసుకుని ఎన్ని చేశారు అనే దానిపై త్రిసభ్య కమిటీ బృందం ఆరా తీసింది. డేటా అంతా పోలీసుల దగ్గర ఉండడంతో ఆ కాపీలను త్రిసభ్య కమిటీ పరిశీలించింది.
కిడ్నీరాకెట్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న శ్రద్ధా ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుమార్‌వర్మ పోలీసుల విచారణలో పలు కీలక వివరాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్‌తోపాటు మధ్యవర్తిగా వ్యవహరించిన మంజునాథ్‌ను పోలీసులు విచారించారు. ఇప్పుడు కుమారవర్మ్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టారు. మరోవైపు పరారీలో ఉన్న ఆస్పత్రి ఎండీ ప్రదీప్ కోసం పోలీసులు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.