ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి లైన్‌లోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధం అయ్యింది ఆ పార్టీ అధిష్టానం. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆ పార్టీ దక్కించుకోలేదు. ఈ క్రమంలో ఎపీపీసీసీ అధ్యక్షునిగా సీనియర్ నేతల పేర్లను పార్టీ పరిశీలించింది.
అయితే చివరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే ఈ పదవిని కట్టబెట్టాలని భావిస్తుంది అధిష్టానం. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఏపీసీసీ అధ్యక్ష పదవికి సూచిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ రిపోర్ట్ పంపినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ రేసులో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, చింతా మోహన్ తో పాటు శైలజానాథ్ పేరు ప్రముఖంగా వినిపించినా చిదరకు కిరణ్ కుమార్ రెడ్డికే పగ్గాలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన సోనియా గాంధీ, ఢిల్లీకి రావల్సిందిగా ఆయనను కోరినట్లు సమాచారం. మొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిన రఘువీరారెడ్డి తప్పుకుని ప్రస్తుతం ఇంచార్జ్ పీసీసీగా ఆయన కొనసాగుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.