టీడీపీ కల నెరవేరుతుందా ? : 24న టీడీపీలోకి కిశోర్ చంద్రదేవ్

  • Publish Date - February 23, 2019 / 01:24 PM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఉన్న సీట్లను దక్కించుకొనేందుకు టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది. అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఎస్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కీలక నేతలు రావడం వల్ల గిరిజనులను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్‌‌కు గాలం వేసి సక్సెస్ అయ్యింది. ఈయన్ను బరిలోకి దింపి అరకులో పట్టు సాధించాలని టీడీపీ కలలు కంటోంది. 

2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం శాసనసభా స్థానాలు వస్తాయి. పార్వతీపురం తప్ప..మిగిలిన స్థానాలన్నింటిలోనూ ‘ఫ్యాన్’ హావా చూపించింది. కానీ కొన్ని పరిణామాలతో అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిరిజనుల ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారనడానికి ఆ ఎన్నికలే నిదర్శనం. ఇది టీడీపీకి మింగుడుపడని అంశం. ఈ ఓటింగ్‌ని తిప్పుకోవాలంటే మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌ బరిలోకి దించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

విజయనగరం జిల్లా కురుపాం జమిందారైన కిశోర్ చంద్రదేవ్‌కు ఏజెన్సీ ప్రాంతంలో మంచి పట్టుంది. గిరిజన ఓటింగ్‌ను ఆకర్షించగల నేతగా ఆయనకు పేరుంది. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తేవడంలో అయన చాలా కృషి చేశారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడుగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన అరకు ఎంపీగా ఎన్నికవ్వగా, 2014 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. 

కిశోర్ చంద్రదేవ్‌ను అరకు ఎంపీగా బరిలో దించితే కురుపాం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం స్థానాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ స్థానాలపై ప్రభావం పడుతుందని టీడీపీ యోచిస్తోంది.  ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఫిబ్రవరి 24న టీడీపీలో చేరుతున్నట్లు కిశోర్ వెల్లడించారే కానీ…వచ్చే ఎన్నికల్లో పోటీపై మాత్రం పెదవి విప్పలేదు. బాధ్యతలు అప్పగిస్తే నిర్వరిస్తానంటూ అందరిలాగే చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికలు అయిపోయిన అనంతరం కిశోర్‌ మళ్లీ బరిలోకి దిగుతారా ? దిగితే ప్రజలు ఆదరిస్తారా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.