కొడంగల్‌లో కలకలం : కాంగ్రెస్ సర్పంచ్ కిడ్నాప్

  • Publish Date - January 9, 2019 / 09:26 AM IST

మహబూబ్ నగర్ : కొడంగల్ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్ధి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా త్వరలో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నిటూరు గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్ధి విశ్వనాథ్‌ను జనవరి 08వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. జనవరి 09వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా విశ్వనాథ్‌ కిడ్నాప్‌కు గురికావడంతో ఉద్రిక్తత నెలకొంది.నామినేషన్ అడ్డుకొనేందుకే కిడ్నాప్ చేసినట్లు సమాచారం. విశ్వనాథ్ 9గంటలుగా కనిపించకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
కొడంగల్ నియోజకవర్గంలో టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిటూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలియచేసింది. నామినేషన్ ఆఖరి రోజున విశ్వనాథ్ కిడ్నాప్‌కు గురి కావడం..దీని వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.