తిరుమలలో నిలిచిన శ్రీవారి దర్శనం

  • Publish Date - April 2, 2019 / 03:04 AM IST

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 6వ తేదీన శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు అధికారులు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయ శుద్ధి చేపట్టిన కారణంగా.. 2 ఏప్రిల్ 2019 మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

వేకువజామున శ్రీవారికి సుప్రభాతం, అర్చన సేవలు చేసి అనంతరం శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణం చేసి వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను అర్చకులు శుద్ది చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.