నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమననీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను. జల్, జంగిల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను. గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడతను. ఇప్పటికీ అడవిబిడ్డల గుండెల్లో కొలువైన ఆ వ్యక్తే కొమరం భీమ్. నేడు ఆయన వర్థంతి.
నిజాం పాలనలో ఆదివాసీలు అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసేవారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటను పండించేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు దట్టమైన అడవిలో భూములను సాగుచేసుకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవ చేసేవాళ్లు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టే వాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీమ్‌ను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు కొమరం భీం. ఆ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చని పోయాడు. దీంతో భీం మహారాష్ట్రలోని బల్లార్షా వైపు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీ పని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించడం.. వాటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మడం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదండ్రులు ఉంటున్న కాకన్ ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద పనికి కుదిరాడు. ఆ సమయంలోనే భీంకు సోంబాయితో పెళ్లి జరిగింది.
ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుపకు చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరగబడ్డాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు.
గిరిజనులు పోడుచేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చిప్పటికీ అధికారుల వేధింపులు తప్పలేదు. భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబరు 1న నిజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన ఘర్షణలో కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్ డార్ఫ్‌ను నియమించింది నిజాం సర్కార్.
హేమన్ డార్ఫ్ గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగఫలితమే.. కొమురం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్ (యు) మండలం పెద్ద దోబలో ఉంటున్నారు. భీం మనుమడు కొమురం సోనే రావ్ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. ఏటా అశ్వయుజ కార్తీక పౌర్ణమి రోజు కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కొమరం భీమ్ 79వ వర్ధంతిని జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. హట్టిలోని భీం స్మారక బేస్ క్యాంప్, జోడేఘాట్ మ్యూజియాన్ని రంగులతో అలంకరించి, భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు. హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వర్ధంతి సందర్భంగా 20 వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.
Read More : TSRTC సమ్మెపై సెటైర్లు : దమ్ముంటే అక్కడ విలీనం చేయండి – తలసాని