ఏం జరుగుతోంది : కూచిపూడికి కూచిబొట్ల..దాతలతో సమావేశం

  • Publish Date - October 17, 2019 / 09:33 AM IST

రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిలికానాంధ్ర ఛైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కూచిపూడికి చేరుకున్నారు. అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఆస్పత్రి కమిటీతో పాటు దాతలతో సమావేశం కానున్నారు. ఆస్పత్రి విషయంలో వచ్చిన ఆరోపణలపై ఆనంద్‌ను దాతలు వివరణ కోరనున్నారు. కాగా.. దాతలతో సమావేశాన్ని రహస్యంగా నిర్వహించాలనుకుంటున్న కూచిబొట్ల ఆనంద్‌… వారికి మాత్రమే సమాచారం అందించారు. సమావేశం నేపథ్యంలో ఆస్పత్రి జీఎం వర్మతో ఆనంద్‌ రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ఆస్పత్రికి రావడంతో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను బుజ్జగించేందుకు ఆనంద్‌ వర్గీయులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై  విచారణకు సిద్ధమైంది. ఆస్పత్రిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌.. గుడివాడ ఆర్డీవోను ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
Read More : నకిలీ ఐడీ కార్డుల కేసులో రవిప్రకాష్ కు 14 రోజుల రిమాండ్