YSR నవోదయం : ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరటగా

  • Publish Date - October 17, 2019 / 01:44 PM IST

ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు..వారిని ప్రోత్సాహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానికి YSR నవోదయం పేరు పెట్టారు. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక కష్టాల్లో ఉన్న పరిశ్రమలకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 80 వేల యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయని అంచనా. లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ చిన్న పరిశ్రమలను ఆదుకొనేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

> గరిష్టంగా రూ. 25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. 
> వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 
> ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ. 2 లక్షల వరకు సాయం చేయనుంది. 
> ఈ పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. 
> రిజర్వ్ బ్యాంకు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.