కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల వరకు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 79 వేల 830 క్యూ సెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపుకు వదిలారు. గంట గంటకు వరద పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి 5 లక్షల 58 వేల 807 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 10 గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదనంగా నాగార్జున సాగర్‌కు 68 వేల 815 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్‌లో 10 గేట్లను 2 సార్లు పైకెత్తి విడుదల చేయడం విశేషం.
మరోవైపు శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతోంది. 4 లక్షల 31 వేల 401 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బుధవారం సాయంత్రానికి జలాశయం 18 గేట్లను 15 అడుగులు ఎత్తి 3 లక్షల 81 వేల 050 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 6 వేల 667, ఎడమ కాల్వకు 2 వేల 557, ఎస్ఎల్‌బీసీకి 2 వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 589.80 అడుగులుగా ఉంది.