సర్కారీ స్కూలంటే అందరికీ చిన్న చూపే.. చదువు చక్కగా చెప్పరని, వసతులు సరిగ్గా ఉండవని, ఎప్పుడూ సమస్యలే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. బాగా ట్రైన్ అయిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పటికీ కూడా చదువు విషయంలో అశ్రద్ధ అనే అనుమానాలు ఎక్కువగా ప్రజలలో కనిపిస్తుంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మాత్రం అటువంటి అభిప్రాయాలు మార్చివేస్తాయి. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన వాతావరణం.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. కార్పోరేట్ స్కూళ్ల కంటే సర్కారీ స్కూళ్లే నయం అన్నట్లుగా ఉంటాయి.
ఆశ్చర్యపోయే రీతిలో పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. దీనికి కారంణం మరెవరో కాదు. కలెక్టర్ రోనాల్డ్ రోస్. ఆయన తీసుకున్న చొరవ కారణంగానే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ బడులంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత.. సమాజంలో బాధ్యత గల ప్రతీ ఒక్కరిపై ఉండాలనే ఉద్ధేశ్యంతో జిల్లా వ్యాప్తంగా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ పాఠశాలల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
ఈ క్రమంలోనే ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి దగ్గర నుంచి స్వచ్ఛందంగా రూ.100 వసూలు చేసి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టగా.. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ కంపెనీలు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి వారివంతుగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు ఈ కార్యక్రమం కింద జమ అవగా, ఆ నిధులతో వసతులను కల్పిస్తున్నారు అధికారులు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టామని, మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి అండగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం అవుతుందని కలెక్టర్ రోనాల్డ్ రోస్ చెబుతున్నారు. స్వచ్ఛందంగా విరాళాలు అందరూ ఇవ్వడం అభినందనీయం అని రోనాల్డ్ రోస్ అంటున్నారు. రూ.కోటికి పైగా వచ్చిన విరాళాలతో జిల్లాలో 601 ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.