ఈ కాలంలో చేతబడులు అనే మూఢ నమ్మకాలను నమ్మే ప్రజలు ఉన్నారా? చేతబడి నెపంతో మనుషులను చంపే జనాలు మన మధ్యే తిరుగుతున్నారా? నమ్మలేకపోతున్నారు కదా? కానీ ఇదే నిజం.. హైదరాబాద్ కు దగ్గరలోని అద్రాస్‌పల్లి గ్రామంలో ఆంజనేయులు అనే 24 యువకుడిని చేతబడి చేశాడంటూ సజీవ దహనం చేసిన ఘటన మరిచిపోకముందే విశాఖ జిల్లాలో ఇటువంటి దారుణమే చోటుచేసుకుంది. మూఢనమ్మకాలతో చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామం నడిబొడ్డున తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేశారు గ్రామస్తులు. డుంబ్రిగుడ మండలం పుట్టబంద గ్రామంలో ఈ అవమానీయ ఘటన జరిగింది.
పుట్టబంద గ్రామానికి చెందిన లోకోయి రామచంద్రు కూతురు రాధకు కిల్లో జయరాం(54) చేతబడి చేశాడని ఆరోపిస్తూ పంచాయతీకి పిలిచారు. జయరాం, అతని కుటుంబ సభ్యులు మధ్యాహ్నం సమయంలో పంచాయతీ వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం పంచాయితీ ఉందని జయరాంను పిలిచుకుని పంచాయితీ వద్దకు తీసుకెళ్లారు ఊరి పెద్దలు. జయరాం అక్కడకు రాగానే రామచంద్రు కుటుంబ సభ్యులు లోకోయి పరశురాం, ముకుందు, నందు, మోహన్, జమున, పద్మలు తాళ్లతో కట్టేసి జయరాంను తీవ్రంగా కొట్టారు.
నాలుగు గంటల పాటు జయరాంను తీవ్రంగా కొట్టిన లోకోయి రామచంద్రు కుటుంబం అడ్డుకునేందుకు ప్రయత్నించిన జయరాం భార్య చెల్లమ్మ, కుమార్తె కమలను చంపేస్తామని కత్తులతో బెదిరించారు. చివరకు గ్రామంలో నడిబొడ్డునే కర్రలు పేర్చి పెట్రోల్ పోసి రోడ్డుపై జయరాంను సజీవదహనం చేశారు. భయపడిపోయిన జయరాం భార్య, కుమార్తె ప్రాణభయంతో కొండగుట్టలు ఎక్కి రాత్రికి రాత్రే వేరే గ్రామానికి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు బాధ్యులను శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.