విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సినిమా నటుడు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయిన మోహన్ బాబు.. వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మోహన్ బాబు మాట్లాడారు.
ఎన్‌టీఆర్ చనిపోయిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదని, ఎంపీనో, ఎమ్మెల్యేనో కావాలనుకుంటే మూడేళ్ల క్రితమే జగన్‌కు మద్దతు ఇచ్చేవాడినని అటువంటి ఆలోచన తనకు లేదని అన్నారు. ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నది తమ శ్రీ విద్యానికేతన్ సంస్థేనని, నా కాలేజిలో జీతాలు ఇవ్వడానికి ఆస్తులను తాకట్టు పెట్టి ఇచ్చానని అన్నారు. ఏపీ ప్రభుత్వం నుండి రూ.19కోట్లు బకాయిలు రావాలని వెల్లడించారు. చంద్రబాబు దగ్గర పేరు కోసం మందిమగాదులు ముఖ్యమంత్రిని కాకా పట్టాలని తనపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
విదేశాల్లో చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని విద్యార్ధులకు ఖర్చు పెట్టలేదని వచ్చిన వార్తలను మోహన్ బాబు ఖండించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుండి నాకు ఏ బాకీ లేదు.. వారి సహాయసహకారాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. వైఎస్ జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని, జగన్ ప్రజలకు మంచి చేసే వ్యక్తియని, మూడేళ్ల క్రితమే జగన్ నన్ను పార్టీలోకి ఆహ్వానించాడని అయితే అప్పుడు చేరలేదని, ఇప్పుడు చేరి రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలా పనిచేయాలని, ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే చంద్రబాబుతో ఉన్న బంధుత్వం, స్నేహం కారణంతో ఏకవచనంతో పిలిచానని వివరణ ఇచ్చారు.