జగ్గయ్యపేట: టెక్నాలజీ రోజుకు ఎంతగా డెవలప్ అవుతోందో..అంతేస్థాయిలో మూఢనమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రాల ముసుగులో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో భూతవైద్యుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన దంపతులు అనారోగ్య సమస్యల కారణంగా అదే ప్రాంతంలోని తాయెత్తు సాయిబు దగ్గరకు వెళ్లారు.
వివాహితకు దెయ్యం పట్టిందని, మంత్రాలతో దానిని వదిలిస్తానని సాయిబు వారిని నమ్మించాడు. మహిళ భర్తను గది బయటకు పంపి మంత్రాలు చదువుతూ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అనంతరం బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో సాయిబుపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.