ఉన్నత చదువు చదువుకుంది. మంచి ఉద్యోగం చేసే భర్త దొరికాడు.. సాఫ్ట్ వేర్‌లో ఉద్యోగం చేస్తుంది. అయితే చిన్న వెలితి అమ్మ కాలేదు. ఐదేళ్లు అయినా అమ్మ కాలేదనే మనోవేధన. చివరకు నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించుకుని మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కట్టుకున్నవారిని, కన్నవారిని శోకంలో ముంచి మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన నాయుడు పూర్ణిమ (31)కు ఐదేళ్ల కిందట గుంటూరు నగరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. యూకేలో ఉద్యోగం చేస్తుండే రామకృష్ణ పెళ్లి తర్వాత ఆమెను ఎంఎస్ పూర్తి చేయించాడు. తర్వాత ఆమె కూడా ఉద్యోగంలో చేరగా.. అక్కడే వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కాపురం ఆనందంగా సాగింది. అయితే వివాహమై ఐదేళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో ఆమె మనోవేధనకు గురైంది. అమ్మ కాలేదనే బాధ ఆమెను కలిచివేసేది.
ఈ క్రమంలోనే వీసా రెన్యువల్ కోసం వారం క్రితం గుంటూరు వచ్చి పని ముగించుకున్నారు. అనంతరం భర్త ఆమెను పుట్టింట్లో వదిలి వారం రోజులు విశ్రాంతి తీసుకుని యూకేకి రావాలంటూ విడిచి వెళ్లారు. అయితే తనకు మరో జన్మ అంటూ ఉంటే నిన్నే వివాహం చేసుకుంటానని భర్తకు.., క్షమించాలని కోరుతూ కుటుంబ సభ్యులకు.. ఉత్తరం రాసి పెట్టి.. ఇంట్లో తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.