మైనారిటీ తీరని ప్రేమలు ఇటీవలికాలంలో ఎక్కువైపోయాయి. సినిమాల ప్రభావమో.. ముదిరిన పిచ్చో తెలియదు కానీ తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయట్లేదు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా పలమనేరులో ఇంటర్ చదివే మైనర్ యువతి తన ప్రేమికుడి కోసం తల్లిని, అక్కను ఇంట్లో బంధించి వారిని బయటకు వదలనంటూ నాలుగు గంటలపాటు గోల గోల చేసింది.
పోలీసులు, అధికారులకు చుక్కలు చూపించింది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురం ఉండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్నమ్మాయి( మైనర్) ఏడాది కాలం నుంచి స్థానికం ఉండే కొరియర్ బాయ్ రెహమాన్‌ను ప్రేమిస్తంది. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని ఇంటినుంచి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని తీసుకుని వచ్చి రెహమాన్‌పై కిడ్నాప్, ఫాక్సో చట్టం కింది కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా.. కూతురి కాలేజ్‌కు పంపడం ఆపేశాడు తండ్రి. కేసులు పెట్టడంతో సైలెంట్ అయిపోయిన ప్రేమికుడు.. ఇటీవల మళ్లీ బాలిక ఉండే వీధిలో తిరగడం మొదలెట్టాడు. ఇది గమనించిన బాలిక ఇంట్లోఉన్న తన తల్లి, అక్కను లోపల పెట్టి తాళం వేసి వరండాలో ఉండి గేటు వేసుకుంది.
లోపల నుంచి బిగ్గరగా అరుస్తూ గోల చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు సిబ్బందితో కలసి బాలిక ఇంటికి వెళ్లారు. తాము న్యాయం చేస్తామంటూ ఎంత చెప్పినా బాలిక వినలేదు. తనకు ప్రియుడే ముఖ్యమంటూ, తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారంటూ అరచి గోల పెట్టింది.
ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పిస్తామని తహసీల్దార్ బతిమలాడినా బాలిక బయటకు రాలేదు. లవర్ వస్తేగానీ రానంటూ గట్టిగా చెప్పడంతో.. ఎట్టకేలకు ప్రియుడి తండ్రి వచ్చి బాలికను బయటకు రప్పించాడు. అనంతరం బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని బాల్య వివాహాలు చట్టవిరుద్ధం అని చెప్పి బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరేదాకా తిరుపతి జువనైల్ హోమ్‌కు తరలించాలని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అయితే బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు మాత్రం కన్నీటిపర్యంతం అవుతున్నారు.