చిత్తూరు జిల్లాలో ఆదృశ్యం అయిన బ్యాంకు ఉద్యోగులు క్షేమం

  • Publish Date - November 2, 2020 / 04:45 PM IST

missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు.

ఆచూకి కోసం ఫోన్ చేయగా…ఫోన్లన్నీ స్విచ్చాఫ్ రావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వీరంతా నెల్లూరులోని హరనాధపురం హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు ఉద్యోగులు.



చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పుత్తూరు డీఎస్పీ ప్రత్యేక బృందంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి వారి ఆచూకి కనుగొన్నారు. గాలింపు చేపట్టిన నాలుగైదు గంటల్లోనే వడమాల పేట పోలీసులు వారిని అడవిలోని కొండప్రాంతంలో గుర్తించారు. బ్యాంకు ఉద్యోగులు గత రాత్రి అడవిలో దారి తప్పిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలోని సదాశివకోన జలపాతం వద్ద శివాలయం ఉంది. అక్కడకు సరైన రహదారి మార్గం లేదు. రోడ్డు మార్గం నుంచి 8 కిలో మీటర్లు కాలిబాటన జలపాతం వద్దకు చేరుకోవాలి. అనేక మంది ఈ పర్యాటక ప్రాంతానికి వస్తుంటారు.



ఆదివారం జలపాతం వద్ద ఎంజాయ్ చేద్దామనుకున్న బ్యాంకు సిబ్బంది…. తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పిపోయారు. ఉదయం జలపాతం వద్దకు చేరుకున్న బ్యాంకు సిబ్బంది, సాయంత్రం వరకు సరదాగా గడిపారు. రాత్రి తిరిగి వచ్చే క్రమంలో చీకటి పడటంతో దారి తెలియక తప్పిపోయారు.

వీరు దారి తప్పిపోయి వెళ్లిన ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందక పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వడమాల పేట పోలీసులు వారినందిరినీ కాలినడకన సురక్షితంగా తీసుకు వచ్చారు.సోమవారం సాయంత్రానికి వారు గుడిమల్లం వరకు కాలినడకన వచ్చి…. అక్కడి నుంచి ట్రాక్టర్ ద్వారా వడమాలపేటకు చేరుకున్నారు. ఉద్యోగులు అంతా క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

       ట్రాక్టర్ లో వడమాలపేట చేరుకున్న HDFC బ్యాంకు ఉద్యోగులు

ట్రెండింగ్ వార్తలు