వైసీపీ అభ్యంతరం : లోకేష్ నామినేషన్ లో తప్పులు

  • Publish Date - March 26, 2019 / 12:13 PM IST

మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ నామినేషన్ లో ట్విస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు కలకలం రేపింది. లోకేష్ నామినేషన్ చెల్లుబాటు కాదని.. పరిశీలన సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కారణాలను కూడా ఆయనే వివరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణ నెలకొంది.
 

అభ్యంతరాలు ఇలా ఉన్నాయి :
నామినేషన్ పత్రాల్లో లోకేష్ ఇంటి అడ్రస్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నట్లు చూపించారు. అయితే నోటరీ మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన సీతారాం అనే లాయర్ చేశారు. తన పరిధిలోకిరాని గ్రామాన్ని.. మరో ప్రాంతంలో ఎలా నోటరీ చేయిస్తారని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటరీ చట్టంలోని సెక్షన్-9ని లేవనెత్తారు. దీంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం ఏంటని లోకేషన్ తరపు లాయర్లను ప్రశ్నించారు. వాళ్లు కొద్దిసేపు టెన్షన్ పడ్డారు. అనంతరం సర్దుకుని.. కొంత సమయం ఇస్తే సరైన పత్రాలు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రిటర్నింగ్ అధికారి.. నామినేషన్ లోని అభ్యంతరాలకు సరైన పత్రాలు ఇవ్వాలంటూ లోకేష్ కు 24 గంటల సమయం ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం అయిన సమయంలో.. నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.