నేనేం ఎర్ర బస్సెక్కి రాలేదు.. ఎమ్మెల్యే ఆగ్రహం

  • Publish Date - February 26, 2020 / 03:28 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం నిర్వహించడంపై శంకర్‌నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆర్‌ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

సమీక్ష సమావేశాలు కేవలం ఫొటోలు దిగడానికి పరమితం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు తమకు మాత్రమే తెలుస్తాయని.. ఆ సమస్యలను మంత్రులు, జిల్లా కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని అన్నారు.

అలాంటిది స్థానిక ఎమ్మెల్యే రాకుండా రివ్యూ మీటింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ కలుగజేసుకుని సమాచార లోపంతో ఇలా జరిగిందంటూ క్షమాపణ చెప్పి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా శంకర్‌నాయక్‌ శాంతించలేదు.