విశాఖ వీధుల్లో టీడీపీ నిరసనలు : మోడీ గో బ్యాక్ నినాదాలు

  • Publish Date - March 1, 2019 / 05:04 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. దీనితో విశాఖ నగరం వేడెక్కింది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ టూర్‌ను నిరసిస్తూ టీడీపీ, ప్రజా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ తమ నిరసనను వ్యక్త పరుస్తున్నారు. బీజేపీ మోసపూరిత విధానాలు అవలింబిస్తోందని నేతలు మండిపడుతున్నారు. విభజన చట్టం హామీలు ఏమీ నెరవేర్చని మోడీ ఏపీలో ఎలా అడుగు పెడుతారని ప్రశ్నిస్తున్నాయి. 

మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు ప్రధాన మంత్రి మోడీ చేరుకుంటారు. ఆయన పర్యటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జీవీఎంసీ గ్రౌండ్ వద్ద వామపక్షాలు, ఇతర కార్యకర్తలు ఆందోళన చేపట్టాయి. విభజన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, విశాఖ రైల్వే జోన్ అంశంపై బీజేపీ మోసం చేసిందని దుయ్యబట్టారు. 

మరోవైపు సీఎం చంద్రబాబు కూడా మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. విశాఖ రైల్వేజోన్ పెద్ద బూటకమన్న ఆయన.. విభజన హామీలు సహా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. మొత్తం 17అంశాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. అలాగే.. ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ.. మరోసారి బాబు నల్లచొక్కా ధరించనున్నారు.