ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా?

  • Publish Date - January 10, 2020 / 07:39 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెలుగుదేశం నేతలు హాజరయ్యే అవకాశం ఉండడంతో విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వారిని గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులను గృహనిర్బంధం చేశారు పోలీసులు. అలాగే ఉయ్యూరులో యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ను హౌస్‌ అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నానీ. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తించకుండా తనను పోలీసులు గృహనిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను అడ్డుకోవడాన్ని ఖండించారు ఆయన. అణచే కొద్దీ ఉద్యమం తీవ్రం అవుతుందని హెచ్చరించారు కేశినేని నానీ.

ఇదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా.. నిమ్మల రామానాయుడును అడ్డుకున్నారు పోలీసులు. అలాగే దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును పోలీసులు గృహనిర్బంధం చేశారు.