నిజామాబాద్ ఎన్నికలు : 185 మంది అభ్యర్థులు..12 బ్యాలెట్ యూనిట్లు

  • Publish Date - April 10, 2019 / 02:07 AM IST

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు… భారీగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధుల్లో 33వేల మంది భాగస్వామ్యం కానున్నారు.  భద్రతాపరంగా పోలీసులు 6వేల మందిని నియమించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. 5 నియోజకవర్గాలు నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఉండగా… జగిత్యాల జిల్లా పరిధిలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

జిల్లా చరిత్రలో తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో… అధికారులు ఈ ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకుని ఏర్పాట్లు చేశారు. 27వేల బ్యాలెట్‌ యూనిట్లను పరిశీలించి సిద్ధం చేశారు. 1788 పోలింగ్‌ కేంద్రాల్లో 21,500 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు. పోలింగ్‌ విధుల్లో సుమారు 27వేల సిబ్బందితో పాటు బందోబస్తు కోసం 6వేల మంది పోలీసులను నియమించారు. ఎం -3 రకం ఈవీఎంలతో తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఈ ఎన్నిక సరికొత్త రికార్డు సృష్టించనుందని అధికారులు భావిస్తున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొత్తం 15 లక్షల 52 వేల 733 మంది ఓటర్లు ఉన్నారు.  

ఇక్కడ 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏడుగురు ఉండగా… 178 మంది రైతు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో దేశంలోనే తొలిసారిగా 12 బ్యాలెట్‌  యూనిట్ల ద్వారా ఎన్నికలకు అధికారులకు సిద్ధమయ్యారు. ఈవీఎంల పరిశీలన పూర్తిచేసి.. పంపిణీ కేంద్రాలకు తరలించారు. ఏప్రిల్ 10వ తేదీ బుధవారం సాయంత్రానికి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు చేరనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పోలింగ్‌ ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలకు పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 6వేల మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 1600 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండగా…. నిజామాబాద్‌ జిల్లాలో 4400 మందిని నియమించారు.  పోలింగ్‌ ప్రక్రియలో పారదర్శకత కోసం వెబ్‌కాస్టింగ్‌తోపాటు కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ సామాగ్రి పంపిణీ ప్రారంభంకానుంది. ఎన్నికల విధులకు గైర్హాజర్ అయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఎంఆర్‌ఎం రావు హెచ్చరించారు.