నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతులు. ఈవీఎంలపై నమ్మకం లేదని చెబుతున్నారు. పైగా ఇప్పటి వరకు తమకు గుర్తులు కేటాయించలేదని.. తాము ప్రచారం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి.. కనీసం 10నుంచి 15 రోజుల వరకు ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన రైతులు.. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.
తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. కేవలం మద్దతు ధర కోసమే ఎన్నికల బరిలో నిల్చామని స్పష్టం చేస్తున్నారు. 185మంది అభ్యర్థులు బరిలో ఉంటే… అందులో 178మంది రైతులే. తమకు పూర్తి స్థాయిలో అవగాహణ కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలని.. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలను ఈసీ పరిగణలోకి తీసుకోని పక్షంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
తమ పై ఎన్నికల కమిషన్ అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు నిజామాబాద్ ఎన్నికల బరిలో నిల్చిన రైతులు. ఈవీఎంల అవగాహనకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బరిలో ఉన్న రైతు అభ్యర్ధులు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తమకు ఇప్పటి వరకు గుర్తులు కేటాయించలేదని, ఎలా ప్రచారం నిర్వహించుకోవాలో చెప్పాలని ప్రశ్నిస్తూ రోడ్డు పై బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు.