సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు.
సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని ఒడ్డుకు చేర్చిన కుమారుడు.. అదే కాల్వలో కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సారమ్మ సోమవారం (జనవరి 13, 2020) బట్టలు ఉతికేందుకు కాకతీయ కాల్వకు తల్లి సారమ్మ, కుమారుడు రవి(26)తో కలిసి వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా ఓ చీరె కాల్వలో కొట్టుకుపోతుండగా దాన్ని పట్టుకొనే ప్రయత్నంలో ఆమె కాల్వలో జారి పడింది. ఇది గమనించిన కుమారుడు తల్లిని కాపాడేందుకు కాల్వలోకి దిగి ఆమెను ఒడ్డుకు చేర్చాడు. సారమ్మ ఒడ్డుకు చేరుకోగా ప్రమాదవశాత్తు రవి కాల్వలో కొట్టుకుపోయాడు.
సారమ్మ కేకలు వేయడంతో సమీపంలోని పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు వచ్చి అతడిని కాపాడేయత్నం చేశారు. అయితే అప్పటికే రవి ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. రవికి భార్య లావణ్య, కూతురు సాన్విక ఉన్నారు. రవి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.