కచ్చులూరులో సుడిగుండాలు : ఆపరేషన్ వశిష్ట..పనులు నిలిపివేత 

  • Publish Date - October 3, 2019 / 05:31 AM IST

కచ్చులూరు గోదావరి ప్రమాదంలో మునిగిపోయిన.. రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం కురిసిన భారీ వర్షంతో… వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నాలుగో రోజు పనులు ప్రారంభించాల్సి ఉన్నా దర్మాడి సత్యం బృందం దేవీపట్నం దగ్గరే ఆగిపోయింది. వరద తగ్గే వరకు కచ్చులూరుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కచ్చులూరులో సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో… ఆపరేషన్ వశిష్ట నాలుగో రోజు కొనగించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. 

మరోసారి ప్లాన్-2ను అమలు చేయాలని దర్మాడి బృందం భావించింది.  ఆపరేషన్లో యాంకర్ ద్వారా మరోసారి ప్రయత్నించడమే కాకుండా.. బోటు మునిగిన ప్రాంతంలో.. నదిని జల్లెడ పట్టాలని నిర్ణయించింది. బోటు గనక యాంకర్ కి తగిలితే.. ప్రొక్లెయిన్ సాయంతో.. ఒడ్డుకు లాగాలని టీమ్ ప్లాన్ చేసింది. ప్లాన్-2 గనక విఫలమైతే.. మళ్లీ ప్లాన్-1 ను అమలు చేయాలని చూస్తోంది దర్మాడి బృందం. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా టీమ్ దేవీపట్నం దగ్గరే ఆగిపోయింది. ప్లాన్-1, ప్లాన్-2 విఫలం కావడంతో బోటు వెలికితీతపై అశలు సన్నగిల్లుతున్నాయి. వరద ఉద్ధృతి పెరిగితే ఆపరేషన్ రాయల్ వశిష్టను.. పూర్తిగా నిలిపివేసే చాన్స్ ఉంది. ఇదే జరిగితే.. రాయల్ వశిష్ట బోటు గోదావరి టైటానిక్‌గా చరిత్రలో మిగిలిపోనుంది.