తండ్రి అస్తికలు కలిపేందుకు గోదావరికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. భార్యాకూతురితో కలిసి కార్యం పూర్తి అయిన తర్వాత పాపికొండల పర్యటనకు బయల్దేరాడు. ఊహించని ఘటన ఎదురై ప్రమాదానికి గురవడంతో భార్య ప్రాణాలతో బయటపడ్డా తన వాళ్లు కళ్లముందే
చిత్తూరు జిల్లాలోని తిరుపతి అక్కారంపల్లికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం.. కుటుంబంతో కలిసి వినాయక్ సాగర్ రాధేశ్యాం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. భార్య మధులత, కూతురు హాసిని స్ప్రింగ్ డేల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఐదు నెలల క్రితం చనిపోయిన తండ్రి అస్తికలను గోదావరిలో కలిపేందుకు రెండ్రోజుల ముందు భార్యా, కూతురితో కలిసి బయల్దేరాడు.
కార్యం పూర్తి అయిన తర్వాత పాపికొండల యాత్రకు బయల్దేరారు. వశిష్ట బోటులో ప్రయాణం మొదలుపెట్టిన ఆదివారం ఉదయం 10గంటలకు గండిమైసమ్మ ఆలయ సందర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరిన బోటు కచ్చలూరు వద్దకు చేరింది. వెళ్తున్న మార్గంలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ బోటును వెనక్కి తీసే ప్రయత్నం చేశాడు.
దీంతో అక్కడ ఉన్న రాయిని బోటు బలంగా తాకింది. అంతే క్షణాల్లో గందరగోళం. కాపాడమంటూ హాహాకారాలతో బోటుతో సహా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. అక్కడ దగ్గర్లో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు గమనించి 10మందిని కాపాడగలిగారు. రెస్క్యూ సిబ్బంది స్పందించి రంగంలోకి దిగడంతో మొత్తం 27మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు.