Paritala Politics : పరిటాల వారసుడి కల

  • Publish Date - March 6, 2019 / 01:59 PM IST

అనంత టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న పరిటాల శ్రీరామ్… తన తల్లి, మంత్రి పరిటాల సునీతతో పాటు తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పరిటాల వారసుడి కల నెరవేరుతుందా? చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది? అయితే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఈక్వెషన్ లాజిక్ ఏంటి? పలుమార్లు పోటీ చేసిన నేతలు ఈసారి తమ వారసులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్… తమ వారసులను ఎన్నికల్లో పోటీ చేయించే విషయంలో అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం కుమారుడు పవన్‌ని తన స్థానంలో పోటీ చేయించేందుకు అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని  పోటీలో నిలిపేందుకు రెడీ అయ్యారు. వీరి ప్రతిపాదనలకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

అనంత టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ రాజకీయ భవితవ్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని పరిటాల కోరుతున్నారు. అయితే పరిటాల కుటుంబ ప్రతిపాదనపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కల్యాణదుర్గం సిట్టింగ్ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరికి టికెట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటును పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నారు. కచ్చితంగా టిడిపి గెలిచే సీటు కావటంతో ఎలాగైనా టికెట్ సంపాదించేందుకు కొద్ది నెలలుగా మంత్రి సునీత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనుచరుడైన రాంమోహన్ చౌదరితో మంత్రాంగం నడుపుతున్నారు.

అసెంబ్లీ బరిలో కొడుకు శ్రీరామ్‌కు లైన్ క్లియర్ చేసేందుకు ప్రత్యర్ధుల ఇళ్లకు వెళ్లి మరీ పరిటాల సునీత లాబీయింగ్ చేస్తున్నారు. కల్యాణదుర్గం సీటుకోసం సోమవారం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లి గంటపాటు మంతనాలు జరిపారు. మంగళవారం రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులును కలిసి పరిటాల శ్రీరామ్‌కు కల్యాణదుర్గం సీటు కోసం మద్దతు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే హనుమంతరాయ చౌదరి, పార్థసారథిలు తమ స్థానాలను వదులకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే హనుమంతరాయ చౌదరి ప్రచారం కూడా ప్రారంభించారు. శ్రీరామ్‌కు టికెట్ ఇస్తే కల్యాణదుర్గం నియోజకవర్గంలో గొడవలు ప్రారంభం అవుతాయని హనమంతరాయచౌదరి అంటున్నారు. శ్రీరామ్ మాత్రం అయితే కల్యాణ దుర్గం లేదా పెనుకొండ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వడం కుదరదని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేస్తే.. కనీసం హిందూపురం ఎంపీగా బరిలో నిలబడాలని అనుకుంటున్నారంట. టీడీపీ అధిష్ఠానం మాత్రం ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అని ఇప్పటికే స్పష్టం చేసింది. మరి పరిటాల ఫ్యామిలీ విషయంలో చంద్రబాబు పార్టీ నియమాలకు కట్టుబడి ఉండారో.. వాటిని బ్రేక్‌ చేస్తారో చూడాలి.